తెలంగాణ సంస్కృతి బతుకమ్మా
తెలుగు ప్రజల హృదయార్తి బతుకమ్మా
తెలగణీయుల సంప్రదాయం బతుకమ్మా
తెలంగాణమట్టి పరిమళం బతుకమ్మా
నాడు మన బతుకులో భాగమై
తీరొక్క పూలతో సింగారిచ్చుకున్న బతుకమ్మా
నేడు ప్లాస్టిక్ పూలతో ఒళ్లంతా
మెరుస్తున్నా
సహజసౌరభ లేపనాలుడిగి కళదప్పింది బతుకమ్మ
ఆడపడచులు చప్పట్లతో వంగిలేస్తూ
చూడముచ్చటగ ముదితల పాటలతో ఆడే పూలపండుగలో
పల్లె సంస్కృతి పరిమళించేది
తెలంగాణ కట్్ట్టుబొట్టుు
తేటతెల్లమయ్యేది
కట్టుబొట్టుతో కనులవిందు జేసే
అలంకరణలు
కమ్మని రుచుల సత్తుపిండి వాయినాలు
అనుబంధపు దొంతరలై
అందమైన విరులై
బతుకమ్మ రూపమై
మనసులల్ల పదిలమై నిలిచే బతుకమ్మ
గుండెల్ని కుదేలు జేసే
డిజే సప్పుళ్ల మధ్య
శివసత్తులూగినట్టు
ఆధునిక పోకడల పేరుతో
ఆడిపాడే ఆటలతో
బతుకమ్మ ఉనికికై పోరాడుతుంది
నాటి రూపానికై నానాపాట్లు పడుతున్నది
నాటి పెద్దమనుషుల పాటల్లేవు
నర్తిస్తూ ఆడేటి ఆటల్లేవు
కట్టుబొట్టు గనిపించని
ఆధునిక పడచుల జూసి
సిగ్గుతో ముఖం చాటేస్తుంది
నాతెలంగాణ
అల్లరి అరుపుల ఆటల జూసి
మౌనంగా రోదిస్తుంది నాతెలంగాణ