Sunday, July 29, 2018

కందములు

1.కోపము మనుజుల కనిశము
తాపము గలిగించు టెదాని తత్త్వం బగుదా
నోపువ హించిన యెడలను
దీపము వలెత్రో వజూపి తీర్చును బాధల్

2.నల్లని మేనున్  నగుమోము
నల్లనయ్య లాలస ముతోడ నూయల లూగన్
ఉల్లము నన్ మురి పెమ్ముతొ
తల్లియ శోధత నయుజూసి తన్మయ మొందెన్

3.మితిమీ రినసం పదలవి
వెతలను గల్గించు టెగాక వేదన లొసగున్
అతిగా కురిసిన వానలు
బతుకులు చిద్రములొ నరించి బాధల నొసగున్

4.
కం.
పాపము జేసెడు వేళలొ
పాపము లనియెరు గలేరు పాపాత్ము లెపుడున్
పాపఫ లమొందె డుతరిన్
తాపమొం దిభీతి లెదరుగ దండిగ వారున్

5.
కం.
దండిగ తరువులు బెంచిన
మెండుగ వానలు కురియును మేదిని యందున్
నిండును చెరువులు కుంటలు
పండును తెలగా ణనేల బంగరు పంటల్

               రాజశేఖర్ పచ్చిమట్ల

Sunday, July 15, 2018

సమస్య

సమస్య.
పడుచున్నను పెండ్లి జేయు వారలు గలరే




గడిచిన రోజుల కొందరు
పడిపడి పరిణయ ములాడి బాధల నొందన్
కడుతీ వ్రతరమ గుపాట్లు
పడుచున్నను పెండ్లి జేయు వారలు గలరే

         -     ప.రా.

Wednesday, July 4, 2018

జనన మరణాలు

జననముమరణము సహజము
అనవర తమగువా నిగూర్చి  తపియించు కంటెన్
మనిషిగ పుట్టిన వంటెనె
చనిపోవు టదిత థ్యమనియు జనులెరు గవలెన్

Monday, July 2, 2018

రైతు నానీలు

1.మబ్బులు లేని
ఆకాశంజూసి రైతు
నిట్టూర్చి నిలవలేక
నేలగూలిండు
2.
చేయడ్డువెట్టి
మొగులు జూసే రైతు
చేను తడువలే
మేను తడిసింది
3.
ఆరుగాలపు శ్రమ
నంగడికొంటవోతే
దళారులే
తళారులైరి
4.
ఆయిటి బూనిందని
ఆశ పడ్డ రైతు
ఇంట్లున్న ఇత్తులు
మంట్లె వోసిండు
5.
మబ్బుపొదుగు సుధకై
మన్నెదురు చూస్తుంది
రైతు స్వేదం
అంకురించాలని
6.రైతు బెంగటిల్లి
బేజారైతుండు
ఎగిసిపోతున్న
ఎరువుల ధరజూసి

Sunday, July 1, 2018

వలపువాహిని



నీ తలపులు
గుండెల్లో గోదారి వెల్లువై
మనసు పొరల్లో
కదలాడుతున్నంత సేపు
నీవు నానుండి దూరంకాలేవు చెలీ!

మన ప్రేమ వాహినికి
నువ్వు నేను చెరో తీరమై
చెలగినపుడు
మనం విడిపోయేదేలా?

గోదారి అలలై
హాయిగొల్పే హోరై
తీరపు ఇసుక తిన్నై
మన ప్రేమ నిత్య నూతనమై
సప్తవర్ణ శోభితమై
అలరారుతుందే గాని
అవిరవదులే చెలీ!