అలల ఊయలపై
అలుపెరుగని పయనం
నిలకడ లేని జీవితంలో
నిరంతరం చేపల వేటతో
అనునిత్యం అపనమ్మకంతో
ప్రకృతి నెదురించి సాగె
బతుకు పోరాటం
గోదావరి ఒడిలో
అలలపల్లకి నధిరోహించి
తెప్పె పడవకు తెడ్డేస్తూ
పొద్దుతో పోటీపడే
సుందర సుమధుర జీవితచిత్రం
బోయీల బతుకు చిత్రం !
ఆలుబిడ్డల ఆకలి తీర్చ
పొద్దుపొడుపుతో నిద్రలేచి
నాటుపడవల నమ్ముకొని
లోతట్టుప్రాంతాలకు
పయనమవుతరు
చేపలు వేటాడుటకు !
చేపలు దొరికినవేళ
తెప్పనిండ విరిసిన జలపుష్పాలతో
మదినిండ విజయోత్సాహం !
నుదుటన గర్వరేఖతో
ఇల్లుచేరెడు బోయీలు !
వేట నిష్పలమైన వేళ
నిరాశ నిస్పృహలతో
మెయినిండ చెమటలతో
విషన్న వదనంతో
తిరుగు పయనంలో బోయీలు!
అలలపై తేలాడే తెప్పలపై
నిరాధారపు పయనం
భరోసా లేని జీవితం !
బోయీల బతుకు చిత్రం !!