Tuesday, August 29, 2017

తెలుగు ఘనత

సీ. ప్రాచీన  భాషయై పరిడవి ల్లినతెల్గు
           గ్రాంథీక మైతన ఘనత జూపె
 సంస్కృత భూయిష్ట సంక్లిష్ట తలుబాపి
           సరళ గ్రాం థీకమై సౌరు లొలికె
 తెనుగుజ నులకంత వెలుగుల నొనరించ
          ప్రామణీ కమ్ముగా ప్రగతి నొందె
 భాషోద్య మమునందు భావప్ర ధానమై  
        వ్యవహరీ కమ్ముగా వాసి గాంచె   
ఆ.వె. పరిపరి విధముల పరిణమిం చినగాని
         తీపి తగ్గలేదు తెలుగు పలుకు
       విబుధజ నులగూడి ప్రభువర్యు లనుగూడి
         తెలుగు భాష కీర్తి తెలిసి వచ్చె

సీ. ఆదిక వికలము నంకురిం చినతెల్గు
             ఆదికా వ్యమునకా ధారమయ్యె
    తిక్కన్న ధీయుక్తి తెలియజె ప్పేటట్లు
             పదునైదు పర్వముల్ పరిఢవిల్లె
    ఎర్రన్న వర్ణన చిగురించి నతెలుగు
             అష్టదిగ్గజముల కడుగు నేర్పె
    పోతన్న ఘంటాన పొంగినట్టి తెలుగు
            మకరంద దారల మరులు గొల్పె


సీ. ఆదిక వికలము నంకురిం చినతెల్గు
             ఆదికా వ్యమునకా ధారమయ్యె
    తిక్కన్న ధీయుక్తి తెలియజె ప్పేటట్లు
             పదునైదు పర్వముల్ పరిఢవిల్లె
    ఎర్రన్న వర్ణన చిగురించి నతెలుగు
             అష్టదిగ్గజముల కడుగు నేర్పె
    పోతన్న ఘంటాన పొంగినట్టి తెలుగు
            మకరంద దారల మరులు గొల్పె

ఆ.వె. పూర్వక వులతోడ పొందికై నతెలుగు
             కావ్యర చనలోన కాంతులీనె
        మేరున గముతీరు సౌరులొ ల్కుతెలుగు
             అంతరిం చుననెడు చింత వలదు


















Monday, August 21, 2017

మోడువారుతున్న గౌడు

పందిరిగుంజకు తలిగేసిన పర్రెలొట్టి
వాకిట్లొ పొంగిపోయె కల్లుకుండ
సుట్టు ముట్టు ముసిరే సువాసన
గౌండ్లొల్ల వాడను గయించ జేస్తయు
పుడితే రాజయి పుట్టాలె
లేపోతె గౌడయి పుట్టాల్నని
ముసలవ్వ సెప్పిన
మాటల మర్మం తెల్వక పోయిన
గౌన్నయినందుకు లోలోపల గర్వపడితి
వయిలన్ని సందుగల సర్ధిపెట్టి
మోకుముత్తాదు  నడుం కట్టుకొని
ఒంట్లో సత్తువంత ఒక్కకాడికి దెచ్చి
ఒరవడిగ నానను జూసి చెట్లెక్క నేర్సుకుంటి
నింగినంటిన చెట్టునెగబాకి
నిలువు నిత్తారం పొంగిపోతి
మొర్రిబింకెడు కల్లుంటె
మోకాలుమంటి అన్నముంటదన్న
నాన్న మాటలె ఊతంగా
కులవృత్తిని నమ్ముకొని చెట్లెక్కి
భరోసా భద్రతలేవి లేక
గాల్లో దీపంలా మోకుతో వేలాడుతూ
మారుగత్తి గీతకత్తి మార్చి మార్చి
ఉల్లిపొరసొంటి మెరలుదీసి
మొగులు మీంచి గంగను దింపినట్టు
అమృత బిందువుల దారి మల్లించి
కల్లుగీసి కాలం గడుపితి
సురపానమున జనుల శ్రమను మరిపించ
గీత కార్మికుడనయి
కులకస్పిని నమ్ముకొని
కూటికి గుడ్డకు లోటులేక
ఆలుబిడ్డలతోటి హాయిగుంటి
ప్రపంచీకరణంలో
ప్రశాంత సంద్రం సుడులు తిరిగింది
పల్లె అల్లకల్లోలమయింది !
వృత్తులన్ని ముడుసు లిరిగి మూలనవడ్డయి
పెప్సీ కోలలతో పోటివడి పొంగలేక
తెల్లగల్లు నీరసించి కూలవడ్డది
సీసల్ల నింపిన యిసము దాటికి
తెల్లగల్లు గుడ్లు తెల్లగిలేసింది
మోకుముత్తాదు సిలుక్కొయ్య కేసి
వలసజీవినై వలవల ఏడుస్తు
బతుకుదెరువుకై బయటి దేశమెల్లినా
తల్లి యాదికచ్చి తల్లడిల్లి
కన్నతల్లసొంటి పల్లెనిడిసుండలేక
మల్లచ్చిన నా మదిలో
నాల్గు చెట్లు పచ్చగుంటే
గౌని జీవితం సల్లగుంటదని
అవ్వ సెప్పిన మాటలు గింగిర్లు గొడుతుంటే
నాటి తాటివనం తలపుకొచ్చి
నాకు తెల్వకుంటనే నాపాదాలటు కదిలినయి
మొన్నటి యాదికై యెతుకుతున్న నా కళ్లు
కన్నీటి సెలిమలలయినయి
వనం వట్టి పోయి సావుకు దగ్గరైంది !
గత చరిత్రకు ప్రత్యక్ష సాక్షుల్లా
మొగులు వడి మోడువారిన తాళ్లు
ఘనమైన గౌని జీవితానికి
నిలువెత్తు నిదర్శనమైన తాటివనం
బతుకుపోరాటంలో తలలు తెగినా
జంకులేక నిలిచిన వీర యోధుల్లా
లోకపు పందిరిని మోసే
నిట్టాడి గుంజల్లా నిలబడియున్న
తాళ్లను జూస్తే
గుండె సెరువయితది !
మనసు బరువెక్కి
కన్నీటి యేరయితది !