Monday, August 31, 2020

బాపురమణ (మణిపూసలు)

 అందమైన బాపుబొమ్మ

ముగ్ధమైన ముద్దుగుమ్మ

లోకమెల్ల మదిదోచిన

కొలువుదీరె పూలకొమ్మ - 24


చిన్నచిన్న గీతలలో

పెనుభావము లొలికించెను

మహానుభావులెందరినొ

మనముందర నిలిపించెను - 25


హాస్యమొలుకు రేఖలతో

వ్యంగ్యమైన రూపులెన్నొ

అలతిఅలతి గీతలలో

మంటరేపు చురకలెన్నొ - 26


ఒకటిరెండు చిత్రాలతో

కథలుకథలు వర్ణించెను

పెద్దపెద్ద మనుషులనూ

తనకుంచెతొ నిర్మించెను - 27


Saturday, August 29, 2020

కైతికాలు

1.
కలంముక్కు జాల్వారె
అక్షరాల అల్లికలు
పదాలయెదలోతుల్లో
నిగూఢార్థ పేటికలు
వరెవ్వా కైతికాలు
కవివరులకు ఐచ్చికాలు!

2.
పూలనిచ్చు మొక్కలు
పళ్లనిచ్చు తరువులు
ఛాయనిచ్చు తరువులు
తనువునిచ్చు తరువులు
వారెవ్వా తరువులు
త్యాగానికి గురువులు

3.
పుడమిపైన పుట్టినట్టి
పచ్చనైన పలుమొక్కలు
భూతాపము చల్లార్చుతు
పులకించును పలుమొక్కలు
వారెవ్వా మొక్కలు
భూమాతకు చొక్కలు

4.
గమ్యానికి భయపడి
గమనమెప్పు డాపకు
దూరానికి భయపడి
తెడ్డేయడ మాపకు
భళిరా నీధైర్యానికి
విజయం బానిసకాదా


గాడుదుల మోతలు
గంగిరెద్దు లాటలు
చిలుకల పలుకులు
సిరిగల్ల సదువులు
వారెవ్వా విద్యార్థులు
భావిభారత పౌరులు! - 5

 గాడుదుల మోతలు
గంగిరెద్దు లాటలు
చిలుకల పలుకులకు
స్వేచ్ఛ లేని సదువులు
వారెవ్వా విద్యార్థులు
వెతల మోస్తుబతుకులు - 6

 మెతుకు రూపకర్తలు
జగతి జీవదాతలు
అహర్నిశలు శ్రమించినా
అప్పులపాలాయె బతుకు
వారెవ్వా రైతులు
గంజిమెతుకుల వ్యథలు - 7

తెలుపురంగు దుస్తులు
నలుపురంగు మనసులు
ప్రజాసేవకులని మరిచి
పలుకుబడిని జూపుడు
వారెవ్వా నాయకులు
మేకవన్నె పెద్దపులులు - 8

 ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
వారెవ్వా సామాన్యులు
ఎండమావి బతుకులు - 9

ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
మధ్యతరగతి మనుషులు
ఎండమావి బతుకులు - 10

 గౌడకుల తిలకుండు
శైవభక్తి తత్పరుండు
ప్రజారక్షణె ధ్యేయంగ
ప్రభవించిన వీరుడు
సర్దారు (సర్వాయి) పాపన్న
గౌడకులంల నువు తోపన్న .11


అఖిలావని రక్షకుడై
అజ్ఙాతమె నివాసమై
పాలక దుశ్చర్యలు గని
విరుచుకుపడె పిరంగియై
వారెవ్వా పాపన్న
ప్రజాసేవకుడు నీవన్న .12


తురుష్కుల నెదురించి
ముసల్మాన్ల మట్టుబెట్టి
దొరల ఆగడాలు బాపి
గోల్కొండలొ ధ్వజమెత్తి
నాయకుడై నడిపించిన
పోరుబిడ్డ పాపన్న .13

బంధుజనుల పాలనకై
పరసేనల కెదురునిలిచె
మృత్యువునే జడిపించగ
అపరకాళియై నిలిచె
మడమతిప్పని యోధుడవన్న
మరువనెమరువం నిను పాపన్న . 14

సకలజనుల దండుగట్టి
నవాబుల మెడలువంచె
కురుబక్షకు చిక్కకుండ
తనకుతాను మరణించె
వారెవ్వా పాపన్న
స్వాభిమాని నీవన్న .15

 మడమ తిప్పని యోధుడు     
  (కైతికాలు)  
గౌడకుల తిలకుండు
శైవభక్తి తత్పరుండు
ప్రజారక్షణె ధ్యేయంగ
ప్రభవించిన వీరుడు
సర్దారు (సర్వాయి) పాపన్న
గౌడకులంల నువు తోపన్న .- 16


అఖిలావని రక్షకుడై
అజ్ఙాతమె నివాసమై
పాలక దుశ్చర్యలు గని
విరుచుకుపడె పిరంగియై
వారెవ్వా పాపన్న
ప్రజాసేవకుడు నీవన్న .-17



బంధుజనుల పాలనకై
పరసేనల కెదురునిలిచె
మృత్యువునే జడిపించగ
అపరకాళియై నిలిచె
మడమతిప్పని యోధుడవన్న
మరువనెమరువం నిను పాపన్న . - 18
       రాజశేఖర్ పచ్చిమట్ల
      గోపుల పూర్
     జగిత్యాల జిల్లా
    9676666353

Friday, August 28, 2020

తెలుగు భాష - కైతికాలు

 పుణ్యనదుల పులకింత

పాలనురుగు నాతెలుగు

సెలయేరుల పరవళ్ల

హోరుపరుగు నాతెలుగు

మాటాడినచాలు

మాధుర్యము జాలువారు - 19

తెలుగుభాష పలికిచూడు

జుంటితేనె జాలువారు

మాతృభాష మాటలాడు

మకరందపు యేరువారు

మరువకుండ మాటాడు

మధువులొలుకు మాతృభాష - 20

అందమైన అక్షరాలు

యాభయారు తెలుగు భాష

ప్రతిపలుకూ ప్రత్యేకత

మమతలొలుకు తెలుగుభాష

పరిపూర్ణపు నాతెలుగు

సౌరులొలుకు విరులసొరగు - 21

కురిసిన మేఘపు మేనున

విరిసిన హరివిల్లు వింత

పరిచిన చీకటి నింగిన

మెరిసి మురిసె పాలపుంత

ప్రదీప్తుల పరవళ్లొలుకు

వెలుగుజిలుగు నాతెలుగు - 22

నింగినుండి తొంగిచూచు

వెన్నెలదొర వెలుగుముక్క

మబ్బునుండి జాలువారు

స్వచ్ఛమైన నీటిచుక్క

పాత్రబట్టి రూపముండు

వ్యక్తిబట్టి వ్యవహారము - 23





Thursday, August 27, 2020

స్వర్గానికి నిచ్చెన


నీఊహల్లో మొలకెత్తిన బంగరుభవితనకు

మెట్టుమెట్టుగ యోచన గూర్చి

ఆశయసాధనకు అడుగులు పేర్చు

అంచలంచలుగ అందలమెక్కి

భావితరాలకు బాటలు వేయి

స్వర్గానికి నిచ్చెనవేసి

బాటసారులకు బాసటనిలువు!


దరిచేరిన లక్ష్యం


మనోపలకంపై గీసుకున్న అందమైన భవితకొరకు

ఒక్కోమెట్టు ఒడుపుగ పైకెక్కు

ఏమరుపాటుతో వేసే అడుగు

పడేయగలదు నిన్ను పాతాళానికి

లక్ష్యంపై గురివుంచి లాక్షణికంగ ప్రయత్నించు

బంగరుమయమైన ఊహలజీవితంలో విహరించు విహంగమై!


 

Wednesday, August 26, 2020

అమ్మ ( పద్యాలు)

 అమ్మజన్మనిచ్చు ఆహార్యమునుబెంచు

గోరుముద్దలిడుతు గోముజేయు

సాకుతుండుమనల సాపర్యములుజేసి

అమ్మకన్నమనకు ఆప్తులెవరు - 1

సాకుతుండు మనల సన్నుతిన్ బాడుచూ

అమ్మయన్నచాలు అనురాగమునుబంచు

ఆకలైనవేళ అన్నమెట్టు

అలసియున్నవేళ మలయమారుతమౌను

తల్లిమించినట్టి దైవమేది - 2

అమ్మయనిన చాలు నాపదలు దూరమౌ

అమ్మయనిన మనసు హాయిగొల్పు

అమ్మయనిన కల్ప తరువుసమము

అమ్మయనిన కలుగు సకల శుభము - 3

Tuesday, August 25, 2020

చిత్ర మధురవాణి

 సాంకేతికత అల్లుకున్న సాలెగూడు లోకంలో

వానకాలపు సదువులే భవితను శాసించేవేళా

అట్టడుగువర్గం అందనిద్రాక్షల చదువుకోసం

ఏకలవ్యులై అక్షరాలు వెతుకుతున్నారిలా - 1


పసిరైతు

పాలబుగ్గల మిసిమి పసివాని బుద్దికి

తలొగ్గినడిచాయి బసవన్నలు రెండు

వసివాడని రెక్కల చెమటలొ తడిసి

పుఢమిమొలిచాయి పజ్జొన్నలు మెండు - 2


పసివాడు పనోడు ఐనందుకు సంతోషించనా?

సదువుమాని సాగు చేస్తున్నందుకు బాధపడనా?

వెన్నంటిన కడుపులెన్ని ఆకలితో అలమటించినా

అన్నపూర్ణ నాదేశమని చాటుతు ఆనందపడనా - 3


Sunday, August 23, 2020

కైతికాలు - సంకపాప

 మెరిసే కురులను తీర్చి

మొక్కజొన్న కులికిందీ

విరిసే జడలుగ పేర్చి

అందం హొయ లొలికిందీ

వారెవ్వా! యీసిత్రం

మక్కగింజ మాయాచిత్రం - 24


ఏడాకులతో యెదిగిన

మొక్కజొన్న మొగ్గదొడిగె

పాలకంకుల పాపలను

సంకనెత్తి సిగ్గులొలికె

వారెవ్వా! సంకపాప

అందమైన కురులజాణ - 25


 మెరిసే కురులను తీర్చి

మొక్కజొన్న కులికిందీ

విరిసే జడలుగ పేర్చి

అందం హొయ లొలికిందీ

వారెవ్వా! యీసిత్రం

మక్కగింజ మాయాచిత్రం - 26


ఏడాకులతో యెదిగిన

మొక్కజొన్న మొగ్గదొడిగె

పాలకంకుల పాపలను

సంకనెత్తి సిగ్గులొలికె

వారెవ్వా! సంకపాప

అందమైన కురులజాణ - 27

 ప్రకృతిలోని ఆసృజన

మొక్కజొన్న మొలిపించె

మనిషిలోని ఈసృజన

కురులసిరులు తలపించె

జయహో! మానవా

నీమేథకు నమస్సులిగో 28

: మొక్కజొన్న చేనులోన

ఒక్కకన్య అగుపించెను

దరిచేరగ జాణలోని

అసలురంగు కనిపించెను

వారెవ్వా! మక్కచేను

అప్సరసలు వెలిచేను - 29

Wednesday, August 19, 2020

కరోనా (ఆ.వె )

 ప్రగతి పథముపేర ఆచారములుమాని

మెలుగు చుండు జనుల మెడలు వంచి

కరొన రోగమొచ్చి కనువిప్పు కలిగించి

పూర్వ పద్దతులకు పూతవెట్టె

Tuesday, August 18, 2020

మణిపూసలు

 

నింగి నేల (మణిపూసలు )



చిటపట చినుకులు కురిసెను
సెలుకల మొలకలు మెలిసెను
సంభ్రమాశ్చర్యము రైతు
మనమున సింగిడి విరిసెను -1

మిన్ను  మెరిసి కురిసెను
మన్ను మురిసి తడిసెను
పుడమిన పయదారతొ
పచ్చదనము విరిసెను - 2

సినుకుసినుకు కలిసెను
అలుగు దుంకి పారెను
ఉరుకులతొ పరుగులతొ
సెర్లు కుంట నిండెను - 3

యేరులన్ని పారెను
వాగులన్ని బొరలెను
జలసిరులతొ సిత్రముగ
చెరువులన్ని నిండెను - 4

వరణుడు కరుణించెను
పుడమి కడుపు వండెను
ఉబికె క్షీర దారతొ
సేనుసెలక పండెను - 5

         పచ్చిమట్ల రాజశేఖర్

నాన్నస్మృతి



నాన్నా నీజ్ఞాపకాలు కళ్లు తడుపుతున్నాయి
నాన్నా నీగతస్మృతులు ఒళ్లు తడుముతున్నాయి

కోడికూతకన్నముందు నిద్రలేచి  సవరించె
పసులపాక లోనిపసులు జాడనడుగుతున్నయి

నిరంతరం తాటివనమె నీయిల్లై నిలిచినావు
బొరియలల్ల చిలుకలన్ని నీరాకను జూస్తున్నయి

ఆరేణుకగుడిలోపల అణువణువూ శుచిచేస్తివి
నీవులేక గుడితలుపులు తెరుచుకోనంటున్నయి

 ప్రతివారిని పలుకరించి పాయిరంగ మాటలాడు
ఆప్యాయత కొరకుమంచి మనసులెదుకుతున్నయి

నీవులేని యింటనేడు వెలుతురులే కున్నదీ
అమ్మనుదురు బోసివోయి చీకట్లు ముసురుతున్నయి

నీవులేని ప్రతీరోజు కళదొలగినరాజస్సే
చందమామ మనలోగిలి పదముమోపనంటున్నయి

కోపం (కందం)

కోపము మనుజుల కనిశము
తాపము గలిగించు టెదాని తత్త్వం బగుదా
నోపువ హించియుం డునెడల
దీపము వలెత్రో వజూపి తీర్చును బాధల్

Monday, August 17, 2020

బహుముఖ వజ్రం - పాములపర్తి

ఆరడుగుల దేహధార్ఢ్యము

ఆచ్ఛాదనపు పంచెకట్టు

సాధారణ లాల్చీలో ఇమిడిన

అసాధారణ రూపం!

ధీరత్వం సాకారమైన

ఆజానుబాహుడి అసలు నిర్వచనం!

బహుభాషా నేర్పుతో

వాణీవిలసిత ముఖవర్చస్సు

గర్వమించుక గానరాని

లక్ష్మీవిలసిత లలాట పలకము

స్నిగ్ధగంభీర ప్రసన్నమూర్తి మన పాములపర్తి!


కన్నవారిని చేకొన్నవారిని 

యశచ్ఛంద్రికల నలంకరించి

వంశప్రతిష్టను వెండికొండ

నడినెత్తిన నిలిపిన వంశోద్ధారకుడు!


కుంటుతున్న ఆర్థికవ్యవస్థకు

కట్టుగట్టి పట్టాలెక్కించి

పరుగులద్దిన అపర ఛాణక్యుడు

చుట్టలిరిగిన బండికి సారధియై

పడిపోకుండ ప్రభుతను నడిపిన

లౌక్యమెరిగిన లౌకికవాది

ఆపద్ధర్మంగా ప్రధానమంత్రిత్వం చేకొన్నా

ఆదర్శవంతంగా నలరించిన ధీశాలి!

దేశభవిష్యత్తును తీర్చుటలో

క్రియాశీల రాజకీయ కౌశలంజూపిన దార్శనికుడు!


సామాన్యపౌరునిగా శాసనసభ్యునిగా 

మంత్రి కేంద్రమంత్రి ప్రధానమంత్రిగా

పదవేదైనా ప్రతిభతో మెరుగులద్దిన మహామనీషి!


మాతృభాషాభిమానిగ మసలుతూనే

పలుభాషాపాండిత్య మార్జించిన బహుభాషావేత్త!

నిండుయవ్వనంలో నిజాం ఆజ్ఞలను దిక్కరించి

హైదరాబాద్ విముక్తిగోరి

వందేమాతరగేయమాలపించిన మాతృదేశాభిమాని!


బూర్గుల బుద్ధికుశలతానీడలో

 పండిన మేథస్సుతో

న్యాయవాదపటిమతో

భూస్వామ్య వర్గాల నెదురించి

భూసంస్కరణలు చేసిన సమసమాజస్థాపకుడు!


అవిరళంగా రాజకీయబాధ్యతలు మోస్తూనే

సాహిత్య పఠనాభిలాష

రచనావ్యాసంగాల పట్ల ఆసక్తివీడని సవ్యసాచి!


అబలాజీవితం లోపలిమనిషిని

సహస్రఫణముల సాక్షాత్కరించిన సాహితీవేత్త!

ఆర్థికసంస్కరణలతో అబ్బురపరిచిన ఆర్థికవేత్త!

పలురంగాల్లో ప్రతిభజూపిన

బహుముఖ ప్రజ్ఞాశాలి!

పలుకోణాల్లో ప్రకాశించిన

దక్షిణాది కోహినూరు పాములపర్తి నరసింహం!

సేకరించినది

 చక్కనైనరూపు సౌశీల్యగరిమను

మాటకారితనము మంచినేర్పు

ఎన్నియున్ననేమి యీరామ చిలుకకు

గండుపిల్లిముందు దండుగయ్యె

జగన్నాథ పండితుడు

గజల్

 నామనసే పూదోటై పరిమళించె నీరాకతొ

నాబతుకే సెలయేరై పరవళించె నీరాకతొ


కల్పనవో కలరూపమొ కావ్యమందు కన్యకవో

కలలన్నీ మధురమయ్యి పరవశించె నీరాకతొ


సురకన్యవొ వరవీణవొ దరహాసపు దొరసానివొ

నామదితెర చందురుడై ఊరడించె  నీరాకతొ


కొమ్మతనువు  లేగొమ్మవొ బాపుచేతి చిత్రాంగివో

యెదముంగిలి బొమ్మకొలువు తారసించె నీరాకతొ


వాకమువో వాగునువో నింగిజారు సెలయేరువొ

ఆనందము సాకరమయి పల్లవించె నీరాకతొ

Sunday, August 16, 2020

బతుకుపయనం

 పుట్టినూరిడిచి పొట్టచేతవట్టుకొని

పాతగుడ్డల ముల్లె పైలంగనెత్తినెత్తుకొని

ఖాళీచేతుల బుగులుబాప

చేయిసంచి తలిగేసుకొని

కనిపించిన దారివెంట 

కనిపించని తీరాలకు సాగే

గమ్యమెరుగని బాటసారులు!

అంతస్తులెరుగక నకనకలాడే ఆకలికి

కడుపులో పేగులు

ఎడతెరిపిలేకుండా

చేస్తున్న సంగీతవిభావరి నాప

పిడికెడు మెతుకులకై

వెతుకులాడే ఊరపిచుక బతుకులు!


బతుకుబాటలొ దాకిన దెబ్బలకు

నొక్కులువోయిన గంజులు

కాకిబలగపు ఆకలిదీర్చలేని

అడుగంటిన గంజినీళ్లు

అలిసినతనువు నడుమాల్సుకుంటే

కునుకురాని కుక్కిమంచం

అయినా రాత్రంతా దోమలతో

మూసినకనులతో ముష్టియుద్ధంజేసి

కొనఊపిరితో సత్తువంత కూడగట్టుకొని

ఉదయాన్నే కైకిలి వెదుకుతూ

చౌరస్తాల్ల ఎదురుచూసే కూలీతనం!

ఆకలిదీర్చే దారిలేక

చేద్దామంటే పనుల్లేక

రోడ్లపక్క తలదాచుకోలేక

పసికందుల వసివాడ్చలేక

సంపాదించిందేమిలేక

బాధ్యతల బరువులు మోస్తూ

కష్టాలవడగండ్లకు నెత్తిబొప్పిగట్టినా

గమ్యంజేర్చే దారిగానరాకున్నా

పుట్టినూరు కన్నతల్లి గుర్తొచ్చి

పల్లెపొలిమేరకు పయనం సాగించే పాదచారులు!

మొలిచినరెక్కలతో దిక్కులకెగిరిపోయినా

ఆనందతీరాల నందలేక

ఉడిగిన రెక్కలతో వెనుదిరిగిననాడు

ఛీకొట్టి చీధరించక

అందరినీ ఆదరించే పెద్దదిక్కు పల్లెటూరు!

సంపదలు పట్నపుదారులు జూపుతే

సంబంధాలు పల్లెదారులు తెరిచి

మానవత మంగళారతులు పడుతుంది!

ఆప్యాయతతో ఆదరిస్తుంది!

మనిషిని మనిషిగ గౌరవిస్తుంది!


Wednesday, August 12, 2020

మనసున్న మానులు


చెట్టును కట్టెలా చూడకు నేస్తం!

చెట్టునూ మానని 

మనసులేనిదని యెంచకు నేస్తం!

చెట్టు ఫలమిచ్చి  కల్పవృక్షమై కనవడుతది

చెట్టు పూలనిచ్చి తత్వబోధిని తలపిస్తది

ఆకులపళ్లెమై అలరారినపుడు

అన్నపూర్ణైతది

నీడనిచ్చి సేదదీర్చినపుడు

 కన్నతల్లైతది

చేతికర్రై ఊతమిచ్చిననాడు

నాన్నై నడిపిస్తది

పశుపక్షుల కాశ్రయమిచ్చినవేళ

తల్లిఒడిని తలపిస్తది!

ప్రాణవాయువునిచ్చి

ప్రాణికోటిని పరిరక్షించువేళ 

అమృతమై అలరారుతది!

చెట్టుతనం కట్టెతనమై

అచేతనమగు కట్టెను కాలుస్తున్నపుడు

మోక్షమిచ్చే మార్గమైతది!

అయినా 

నువుగొడ్డలితో నరుకుతుంటే

ఆనందంగ నేలకొరుగుతది!

త్యాగానికి నిలువెత్తు నిదర్శనమై

మంచితనానికి 

మనసున్న తనానికి

తరువే గురువై తారసపడుతది!

Sunday, August 2, 2020

నాన్నస్మృతి( గజల్ )


నాన్నా నీజ్ఞాపకాలు కళ్లు తడుపుతున్నాయి
నాన్నా నీగతస్మృతులు మదిని తోడుతున్నాయి

కోడికూతకన్నముందు నిద్రలేచి  సవరించె
పసులపాక లోనిపసులు జాడనడుగుతున్నయి

నిరంతరం తాటివనమె నీయిల్లై నిలిచినావు
బొరియలల్ల చిలుకలన్ని నీరాకను జూస్తున్నయి

ఆరేణుకగుడిలోపల అణువణువూ శుచిచేస్తివి
నీవులేక గుడితలుపులు తెరుచుకోనంటున్నయి

 ప్రతివారిని పలుకరించి పాయిరంగ మాటలాడు
ఆప్యాయత కొరకుమంచి మనసులెదుకుతున్నయి

నీవులేని యింటనేడు వెలుతురులే కున్నదీ
అమ్మనుదురు బోసివోయి చీకట్లు ముసురుతున్నయి

నీవులేని ప్రతీరోజు కళదొలగినరాజస్సే
చందమామ మనలోగిలి పదముమోపనంటున్నయి

వైభవ భారతం - రాజశ్రీలు


తలపైన హిమన్నగము
పాదాల హిందుసముద్రము
ఎడుమనరేబియ సముద్రం
కుడిని బంగాళాఖాతం - 1


భరతుడు పాలించిన భూమి
పాడిపంటల పవిత్రభూమి
బంగరుపంటల సేద్యసీమ
సకలసంపదల భాగ్యసీమ - 2

గంగాయమున పవిత్రనదులు
కృష్ణకావేరిసింధుగోదారి నదులు
పరవళ్లు తొక్కిన జీవనదులు
పరవశించిన పల్లెసీమలు - 3

మనములనిండా విచిత్ర చిత్తులు
మనుషులలోనా విభిన్నవృత్తులు
వృత్తేదైనా ప్రేమిస్తుంటాం
భారతీయతకై జీవిస్తుంటాం - 4

భూగోళఖగోళ మర్మముల
శోధించిఛేదించిన నేల
అన్నివిద్యలకాలవాలమైనది 
సకల శాస్త్రముల నెలవైనది - 5

సకలసృష్టిలో సర్వాత్మనుజూసి
పరులసేవలో పరమాత్మనుజూసి
ప్రకృతినమితం ప్రేమించిన నేల
పంచభూతాల పూజించిన నేల - 6

 
తాత్వికచింతనలో తారాడి
భగవద్సాధనలో తేలాడి
ఋషిమునిగణము నడయాడిన నేల
పరమపదం పారాడిన నేల- 7

సర్వవిద్యాదురంధరులు
సకలశాస్త్ర పారంగతులు
పుట్టిపెరిగిన పుణ్యభూమి
తత్వవేత్తల ధన్యభూమి - 8

తపోవిద్యలో తలామునకలై
కైవల్యం కరతలామలకమై
యోగవిద్య నందించి నేల
జగతికివిద్యలు నేర్పిన నేల - 9

సకలసంకృతుల కాటపట్టు 
సంప్రదాయముల కాయువుపట్టు
ప్రాణికోటికంత పవిత్రభూమి
మానవతావిలువల మహితభూమి - 10


Saturday, August 1, 2020

తెలంగాణ అస్తిత్వం కాళోజీ (కైతికాలు)


నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 30

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 31

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -32

అన్నదమ్ముడెవడులేడు
న్యాయాన్యాయాల తాన
తప్పుచేస్తె యెవడినైన
నిలదీస్తా ఉన్నతాన
వారెవ్వా కాళోజీ
నిజంగానే ప్రజలమనిషి - 33

ప్రజాగోడు ప్రకటించగ
కలమెత్తిన  కవియోధుడు
ప్రజలుద్యమ నాయకుడై
గళమెత్తిన మహధీరుడు
వారెవ్వా కళన్నా
తెలుగు ప్రజల పెద్దన్నా - 34

బడిపలుకుల భాషగాదు
మనపిల్లలు చదువవలెను
పలుకుబడుల భాషలోనె
ప్రజలంతా చదువలెను
వారెవ్వా కాళోజీ
తెలంగాణ వెలుగోయి - 35

ప్రజలగొడవను ప్రశ్నించ
పాళినిసవరించినాడు
బడుగుజీవి బాధలకై
గొంతును సవరించినాడు 
వారెవ్వా కాళోజీ
కలము దూసిన శివాజీ! - 36

కలములోని సిరానంత
అక్షరమాలలుగమలచె
గళమెత్తి గర్జించి
లక్షమెదళ్లు గదిలించె
వారెవ్వా ! కాళోజీ
పడలేదెన్నడు రాజీ! - 37

పలుకుభాష రాయుభాష
రెంటినడుమ భేదమేల?
పలికేటిది రాయుటకూ
మనుషులంత జంకనేల
బడిపలుకులు కాదుభాష
పలుకుబడియె అసలుభాష - 38