Thursday, October 31, 2019

గజల్ - వేంకటేశ స్తవం



ఏడుకొండల వాడ ఓ వెంకటేశా
మూడునామాల వాడ ఓ శ్రీనివాసా

అలవేలు మంగమ్మ యలకదీర్చుటే గాదు
ఆదరించి బ్రోవుమయా ఓ శ్రీనివాసా

చీకుచింతలేకుండా శేషశాయి వైనదేవ
మాచింతలు బాపరావ ఓ శ్రీనివాసా

ఎత్తయిన కొండపైన గమ్మత్తుగ నీవుంటివి
బడలిక దరిజేరకుండ పథము గూర్చు ఓశ్రీనివాసా

గరువాహనుడవై గాలిలోన దిరిగేవు
మాపదముల మహిమనీయి ఓ శ్రీనివాసా

నీమహిమలు ఈ కనులతో గాంచలేని  దుర్బలులం
నీఛాయను నిలువనీవ ఓ శ్రీనివాసా

నీపదముల కీర్తించెడు భక్త 'శేఖరు' లనుగని
కైవల్యపదము నొసగు ఓ శ్రీనివాసా

గజల్ - శివనివేదన

ధీనజనుల దరికిజేర్చి కరుణబ్రోవరా శివా
భక్తవరుల చెంతనిలిచి వరములీయవా శివా

అహర్నిశలు నీనామమె నామదిలో అలలాయె
నాహృదిసంద్రపు ఘోష దీర్చి మదినిలువవా శివా

తేజరిల్లు కనుదోయితో నీరూపము చూడనయితి
కలనైనా కనిపించి కలతబాపవా శివా

తల్లిదండ్రి నీవేనని నీసేవలొ మునిగితిని
మోక్షపథము నొనగూర్చి ముక్తినీయవా శివా

భవబంధపు జీవితాన 'శేఖరు' బాసటనిల్చి
నీతనువున విభూదిగా నిలుపుకోవా శివా

గజల్ - వలపుసమీరంం

వలపురాగ సమీరములు ప్రసరించవే నాహృదిలో
మరుమల్లెలు మకరందము కురిపించవే నాహృదిలో

పలకరింపు కానరాక మూగదైన  మనసుమీటి
సుస్వరాలగీతాలను పలికించవే నాహృదిలో

అనురాగపు జల్లులేక బీడువారు జీవితాన
నీచెలిమితో పసిడి సిరులు పండించవే నాహృదిలో

ఏబంధం దరిచేరక ఒంటరైన యీబతుకులో
నీరాకతో బంధాలను పూయించవే నాహృదిలో

నీతలపుల జాడలేక శిశిరమైన శేఖరు మది
నీపదముల వంతమును పూయించవే నాహృదిలో

Tuesday, October 29, 2019

నింగి నేల (మణిపూసలు )



చిటపట చినుకులు కురిసెను
సెలుకల మొలకలు మెలిసెను
సంభ్రమాశ్చర్యము రైతు
మనమున సింగిడి విరిసెను -13

మిన్ను  మెరిసి కురిసెను
మన్ను మురిసి తడిసెను
పుడమిన పయదారతొ
పచ్చదనము విరిసెను - 14

సినుకుసినుకు కలిసెను
అలుగు దుంకి పారెను
ఉరుకులతొ పరుగులతొ
సెర్లు కుంట నిండెను - 15

యేరులన్ని పారెను
వాగులన్ని బొరలెను
జలసిరులతొ సిత్రముగ
చెరువులన్ని నిండెను - 16

వరణుడు కరుణించెను
పుడమి కడుపు వండెను
ఉబికె క్షీర దారతొ
సేనుసెలక పండెను - 17

         పచ్చిమట్ల రాజశేఖర్

Friday, October 25, 2019

కైైతికాలు - ప్రకృృతి

కారుమబ్బు కానరాదు
వాగుపరుగు గానరాదు
సాగునీరు చేరరాదు
బతుకుదెరువు గానరాదు
వారెవ్వా ప్రకృతి
తలపించును ఎడారి -1

సాలువాన పడనెలేదు
పచ్చికేడ మొలువలేదు
పశువులకు మనుగడె లేదు
పాడిఊసు లేనెలేదు
వారెవ్వా ప్రకృతి
చేసెనంత వికృతి - 2

పుడమికి అందం తరువులు
జగతికి నందం తరువులు
ప్రగతికి మార్గం తరువులు
ప్రజలకు గురువులు తరువులు
వారెవ్వా తరువులు
సిరులు పొరలు దరువులు - 3

కైైతికాలు - కవులు

సామాజిక క్షేత్రంలో
అక్షరాలు జల్లుతారు
సమస్యలే ధ్యేయంగా
కవితలెన్నొ అల్లుతారు
వారెవ్వా పండితులు
జగతి మార్గదర్శకులు - 1

పరులెవ్వరు బాపలేని
చీకట్లను వారజూచి
రవిచూడని లొసుగులెన్నొ
మనోనేత్ర వారజూచి
కలము కరవాలమ్మున
చీల్చుతు చూండాడుతారు -2

విపరీతపు పోకడలతొ
సమాజ గతితప్పినపుడు
ప్రగతి పేరు జెప్పిజనులు
పతనమయి పోతున్నపుడు
చెంపజరిచి చెడునుబాపి
మంచిజూపు మహాత్ములు - 3

అభివృద్ధను పేరుజెప్పి
పాతాలము బాటవట్టి
విపరీతపు పోకడలతొ
విర్రవీగి  పోవునట్టి
వెర్రిమాన్పి వీపుచరిచి
మేలుకొలుపె మానధనులు - 4

మణిపూసలు - బుధులు

 వాణీ ఉపాసకులు
సరస్వతీ పుత్రులు
జ్ఞానపుంజముచేత
శోభిల్లే కవివరులు -11

 వాణీ ఉపాసకులు
సరస్వతీ పుత్రులు
దివ్య తేజముచేత
శోభిల్లే కవివరులు- 12

Thursday, October 17, 2019

సమస్య

సమస్యాపూరణం

పిడిగల్గిన నగ్గిబుట్టె పీతాంబరుడా

సుడిగా లికివన మందున
నిడివిగ తరువులవన్ని నిలకడ లేకన్
వడివడి గపలుమ రులురా
పిడిగల్గిన నగ్గిబుట్టె పీతాంబరుడా

  రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, October 2, 2019

జనం మెచ్చిననేత గాంధీ


(గాంధీ 150 వ జయంతి సందర్భంగా గేయాంజలి)

పల్లవి.
బోసినవ్వులతొ వెలిగే తాత
సత్యాగ్రహముల శాంతిదూత ॥2॥
భారతఖండపు ప్రగతి విధాత
మానవలోకపు స్పూర్తి ప్రదాత॥2॥    ॥బోసి నవ్వులతొ ॥

1చ.
నిత్యము సత్యము పలకాలంటూ
మనిషిలొ మంచిని పెంచాలంటూ
విశ్వమానవత విరిసిలాగా
సమతామమతలు పంచిండు
సమాజ ప్రగతిని జూపిండు       ॥బోసి నవ్వులతొ ॥
     
2చ.
ఉప్పు సత్యాగ్రహమును బూని
సమరశంఖమును తా పూరించి
అఖండ విశ్వమ్మనుసరించేల
అహింసోద్యమము నడిపిండు
ఆంగ్లేయులను తరిమిండు ॥బోసి నవ్వులతొ ॥

3చ.
అసమానతలను అనుమతించక
మనుషులమధ్యన భేదాలెంచక
మానవత్వమనె పునాదిపైన
భారతజాతిని నడిపిండు
ప్రగతి బాటలు వేసిండు
॥బోసి నవ్వులతొ ॥

4చ.
నిరాడంబరతె నిత్యసూత్రమై
నిజాయితీయె నిజరూపమ్మై
సత్యాహింసలే సాయుధమ్ములని
శాంతిపథమ్మును జూపిండు
స్వాతంత్ర్యము సాధించిండు
॥బోసి నవ్వులతొ ॥

5చ.
జయహో జయహో గాంధీతాత
జగజ్జనావళి మెచ్చిన నేత
అందరి మనసుల ఆరాధ్యుడవై
అజరామరమై వెలిగే నేత  ॥బోసి నవ్వులతొ ॥