Friday, September 14, 2018

ముగ్గు



ముసిముసి మబ్చుల నిద్రలేచి
మిణుగురులై మెరిసి
దాగుడుమూతలాడుతూ
మబ్బుల దాగిన చుక్కల
మనసువెట్టి ఏరుకచ్చి
ఆవుపెండతోటి అలుకుజల్లిన ఆకిట్ల
అందంగా అదిమిపెట్టి
అరిపిండితోటి చారుకలోలె
లక్షణంగ చుట్టూర
లక్ష్మణరేఖలు గీసి చుక్కల బందించి
పూలులతలు దీర్చిన
పొదరింటి వాకిల్లు
ఇల్లాలి చిత్రకళా నైపుణ్యానికి
సజీవ సాక్షాలు

చిరునగవుల బుడ్డోడి
చిగురాకు చేతుల్లో
మెళుకువతొ మైదాకు వెట్టినట్టు
అవని యాలంభనగా వంగి
సుతారంగా చుక్కలు పొదిగి
పుడమిపై ముగ్గులువెట్టే
అతివల అందాలకు
ముగ్ధులై మురిసిపోదురు
సూసుకుంట వోయెటోళ్లు

అందంగా గూర్చిన
రంగవల్లుల జూసి రంజిల్లి మురిసి
దివిపైనె దిరిగేటి సకలదేవతలు
వాకిల్లలో జేరి వరుసబాడుదురు
ఇల్లలో కొలువై ఇచ్ఛ దీర్చెదరు

No comments: