Tuesday, February 27, 2018

నాగరికత వారసులు

నగరవాసులం
నాగరికత వారసులం
అన్నీ మాకే తెలుసనుకుంటం
ఫలితం కోసం పరితపిస్తుంటం!

కళ్ళముందు జరిగిందేది కనిపించదు మాకు
యథార్థ విషయాలేవి బోధపడవు మాకు
మేం మేముగానే ఉంటాం
అయినా మేం నాగరికులం!
నాగరికతకు వారసుల!!

పక్కన్న వాళ్లను పట్టించుకొనే తీరికలేదు
ధీనుల జూసి స్పందించే మనసులేదు
సాటివారికి సాయపడాలనే సోయి లేదు
అయినా మేం నాగరికులం!
నాగరికత వారసులం!!

ప్రతి వారిని తమ వారిగ భావించి
ప్రతీదానికీ ప్రతిస్పందించే
నవనీతపు ముద్దలాంటి హృదయం
ఇనుప చువ్వల పక్కటెముకల
చెరసాలలో బంధించబడ్డది
మానవత్వం మసకబారి
స్వార్థపు సాలెగూడుల చిక్కువడ్డది
అయినా మేం నాగరికులం!
నాగరికత వారసులం!!

Monday, February 26, 2018

కాయకు బరువైన తీగె

అంతరిక్షపు అంతరాలు
అఖాతాల లోతులు తెలిసిన మనిషి
జీవితమూలాల నెరుగలేక
తను కూర్చున్న కొమ్మను నరికున్నట్టు
నిలువ నీడనిచ్చిన చెట్టు
ఆకులన్ని రాలగొట్టినట్టు
కష్టాలను కడతేర్చి
సుఖమయ జీవితబాటలు వేసిన
అనుభవ వారధులను అవివేకంతో కూల్చినట్టు
జన్మనిచ్చిన తల్లిదండ్రులను
భారమనుకొని బాధపడుతుండు!
తీగెకు కాయ బరువుకానిది
కాయే తీగెను బరువనుకొని
దింపుకోవాలని దిగులుపడుతుంది!
పంండుటాకులు లేనిది
తను లేడనే యథార్థమెరుగలేక
నిర్ధయతో నెట్టేసి
నిరాధారమై నిట్టూరుస్తుంది!వృద్ధాశ్రమం

అహర్నిశలు ఆరాటంతో
జీవితాంతం శ్రమించి
జవసత్త్వాలన్ని అరగదీసి
గంధ లేపనంగా హాయినిబంంచి
కలిగంంజితో కాల మెల్లదీసి
పిల్లలను పెంచుతూ
మండుటెండలో తాను గొడుగై
 భావి తరానికి నీడనిస్తూ
పిల్లలకోడోలె తిరిగిన తల్లిదండ్రీ
ఎడవాసినాక ఒంటరయినట్లు
వలస పక్షులకు ఆవాసమిచ్చి
ఆనందాతిశయ మనుభవించిన చెట్టు
వెళ్లిపోయిన వేళ వెలవెల బోయినట్లు
రెక్కలచ్చిన పక్షులు వదిలేసిన గూడోలే
దిగాలుపడి దినదిన గండంగా
బతుకీడుస్తున్న  జీవచ్చవాలకు జీవగర్ర !
నడుములొంగి నడువలేని
ముసలిప్రాయానికి ఆసరయ్యే ఊతకర్ర !
చరమదశలో చతికిల బడిన బండిని
వైకుంఠధామానికి నడిపించు స్వర్గధామంం "వృద్ధాశ్రమం"

Sunday, February 25, 2018

దివికేగిన దేవకన్య

అందానికి నిలువెత్తు నిదర్శనం
అభినయాని ఆలవాలం
చిరునగవుల చిరునామా
నిత్య యవ్వన నింగిభామా!

అందానికి ఆహార్యము జోడించి
అభినయంతో ఆకట్టుకొని
లాగవ లావణ్య లాలిత్యములతోటి
బాలనటి మొదలు బాలీవుడ్ వరకు
అశేష అభిమాన కోటి మనసుల్లో
చెరగని ముద్రవేసిన వెన్నెలభామా!


సుందర సుకుమార
మనోజ్ఞ మధురభావాలు మేళవించి
నటనకు నడకలు నేర్పి
చిత్రసీమలో చిరస్థాయిగ నిల్చిన
అందాల అపరంజి బొమ్మ
కలువకనుల కలువభామ
భువినుంచి దివికేగిన గందర్వ కాంత
అందరి మనసులు దోసిన అప్సరస
చిరయశస్వి శ్రీదేవికి
అశ్రునయనాలతో నిమంత్రణం!
ఇంద్రపురి నీకు పలికిందా ఆమంత్రణం!!

(శ్రీదేవికి అశ్రునివాలి 25/2/2018)

Tuesday, February 20, 2018

భాష - యాస

అక్షర మల్లెలు విరబూసిన
             అలరుబోడి నాతెలుగు
అరవిందాలు వెల్లివిరిసిన
             పున్నమి వెలుగు నాతెలుగు
చిరునగవు పలకరింపుల
             చిరునామా నా తెలుగు
చిరయశస్వియై వెలిగే
             చిరంజీవి నాతెలుగు
మధురమైన భావాల
             మారురూపు నాతెలుగు
కల్మష మెరుగని
            మనసుల కలబోత నాతెలుగు
పరాక్రమం ప్రదర్శించు
             పలుకులున్న నాతెలుగు
నవరసాల నొలికించు
             కవనమల్లు నాతెలుగు
అంగార శృంగారములను
            అలవోకగ వెలువరించు నాతెలుగు

అందమైన విరులతోడ
అల్లిన హారం నాతెలుగు భాష!
ఆపూవులహారంలో
దాగిన దారం నా తెలగాణయాస!!

మధురభావాల ఝరి

హిమగిరి శిరమునుండి
పొంగి పొరలిన భాష
ఢమరుక నాదం నుండి
జాలువారిన భాష
అందమైన వర్ణాలతో
పొందికైన తెలుగు భాష

మనసులోని భావాలను
వెలువరించదగిన భాష
వీణులవిందై సాగే
వీణానాదమె తెలుగు భాష !

మనసును మురిపించు భాష
చెవులకు యింపైన భాష
సిరిమువ్వల సవ్వడిలా
సందడిచేయు తెలుగు భాష !

సెలయేటి గలగలలా
చిందులేయు తెలుగుభాష!
సకల చరాచర జీవకోటిని
తాదాత్మ్యమొనరించు తెలుగు భాష!
మదిలో అంకురించెడు
మధురభావాల ఝరి నాతెలుగు భాష!!
లోక రీతులు (నానీలు)

దుష్టుని స్నేహం
నిప్పు స్వభావం
తాకితే గాని
బోధ పడదు తత్వం !

మగువ మనసు
సంద్రపు లోతు
ఈదితే గాని
వీడదు రహస్యం !

మూర్ఖుని మొండితనం
పండితుని పాండిత్యం
తరచి చూస్తే గాని
తెలియదు యథార్ఠం !

చురకలు (నానీలు)

ఉన్నతాసనం కాదు
అధిరోహించేది
ఎదుటివారి
హృదయాసనాన్ని!

ప్రపంచాన్ని జయిస్తే
కాదు విజేత
తల్లిదండ్రుల
మనసు గెల్చిన వాడు !

సభలందు కాదు
నాయకుడు ప్రకాశం
ప్రజా సమస్యల
పరిష్కారమందే!

దుష్టుని స్నేహం
శుచి(నిప్పు) స్వభావం
తాకితేగాని
బోభపడదు తత్త్వం!

చనిపోయిన వాడు
కాదు దేవుడు
సాటి జనుల
కన్నీరు తుడుచు వాడు!

కరవాలపు
రక్తదారలో లేదు శౌర్యం
కలవాలపు
శాంతిపథమ్మునే!

నిన్ను నీవు
పొగడు కోవడంకాదు
సకలజనం
సంస్తుతించేలా చూడు!

Monday, February 19, 2018

అమలిన బంధం

లేగను జూసి ఆవు
పొదుగు నిండ పాలు సేపినట్టు
చెలికాని జూసి వెలది
పయ్యెద పొంగి పొరలినట్టు
నింగి వేలాడు మబ్బులను జూసి
నేల పరశిస్తుంది!
వసంతాగమనంతో
వసుమతి సప్తవర్ణ సరాగ
సోయగం సంతరించుకుంది!
జాలు వారు నీటిచుక్కలతో
గర్భం దాల్చి
పులకించి పురుడోసుకుంది!
తనువణువణువూ
పచ్చదనంతో కళకళలాడుతుంది!
పసిడి పంటల కాలవాలమై
ప్రకృతంతా పుష్ప ఫల శోభితమై
పశుపక్షాదుల కాలవాలమై
పుడమి పుత్రపౌత్రాదులతో
సుభిక్ష సుందర నందనవనమై అలరారుతుంది!


మనిషితనం

నివురు గప్పిన నిప్పోలే
ప్రతి మనిషిలో ఉంటుంది
మంచితనం మనసు లోతుల్లో !

అవసరాన్ని బట్టి అగుపిస్తుంది
అంతలోనే మాయమవుతుంది
మిణుగురులా మిణుకుమంటూ !

మానవత్వం పరిమళిస్తుంది
మంచితనం వెల్లివిరుస్తుంది
కాలానుగుణంగా మనిషితనం
సౌదామిని వలె సాంతం వ్యాపిస్తుంది !ప్రాకృతిక శోభ

ఆస్వాదించే మనసుంటే
     అందం నీ సొంతమవుతుంది
ప్రకృతి సప్తవర్ణ శోభితం!
రామనీయం రాగరంజితం !

భ్రమరం నీవైతే ప్రకృతిలో
 ప్రతి పూవూ నిన్నాహ్వానిస్తుంది!
సహృదయుడు నీవైతే
ప్రకృతి అందమంతా ఆరబోస్తుంది!

తుమ్మెదవయి సౌందర్యపు
పుప్పొడులను ఆస్వాదిస్తావో!
దర్దురమై తామరల చెంత
వసించి వ్యస్తమవుతావో?


వెలుతురు లేని గాజు కనుల ముందు
రంగులన్ని వెలవెల బోయినట్లు
కాంచలేని మనసు ముందు
అందమంతా ఆవిరవుతుంది
ప్రకృతి వికృతయి
                      పరిహసిస్తుంది!


చెలి తలంపు

ఆకాశంలో విహరించే
       నిన్ను చేరుకోలేను
నా హృదయాకాశంలోని
       నీ  బొమ్మను చెరిపేయలేను
అప్సరసవ నెరిగి మనసు పడితినే గాని
అవనిపై నిలువజాలవని తెలియనైతిని
అద్దం లాంటి హృదయంలో
             నీబొమ్మ నిలుపుకున్న !
నన్ను నేను మరిచి పోయి
             నీ తలపుతో బతుకుతున్న!
చెలీ!
 నీ రూపు తుడిచేందుకని
నా మనసు విరిచి విసిరేయకు
విసిరినముక్కలను రాసిగ పోసి చూడు చెలీ!
ప్రతి ముక్కలో నీ బింబమగుపించదా

Thursday, February 8, 2018

ఇంతి మనసు

ఇల్లాలి మనసులోతుల్లో
ఎన్నెన్ని ఊట చెలిమలున్నాయో?
గాలి వాటమును సైతం
గదాహతమని యెంచి
ఊరకనే నీరు
ఉబికి వస్తుంటాది !

కవుల
కాంతల నిలువెల్ల
సుకుమార కుసుమాల బోల్చి
అతి సౌకుమార్యము
నంటించినారేమో ?

గొంతు కొలది
నీట మునిగియున్న కలువ
లోకానికందాన్ని
చూపించటం లేదా ?

గళమందు
కంటకం గుచ్చుకుంటున్నా
గులాబి విరబూసి
గుభాళించటం లేదా ?

కష్టాలు అనంత వ్యాపకాలు
దుర్బినిలో చూస్తే కొండంతలు
గ్లోబులో చూస్తే గోరంతలు!