Thursday, December 21, 2017

బాలగేయం

లలలా లలలాలలాల లలలాలలా
బడిలో నా బాల్యమంత గడిచిపోయెరా
పసితనముల     ఆటలన్ని వసివాడెరా "2"


అడుగు నేర్చిన డంటే బడికి పంపు డాయే
ఆటపాటకు నేడు ఆదరణె కరువాయె
పలుకా బలుపమిచ్చి పని జెప్ప వట్టిరి ॥2॥
ఆడుతూ పాడుతూ తిరిగేటి వయసులో
మూట మోసుకుంటు బడికి వోవుడాయే॥బడిలో॥


తొక్కుడు బిల్లల్లేవు దాగుడు మూతల్లేవు
మురుసుకుం టాడేటి ముక్కు గిల్లుడు లేదు
కూసోని ఆడేటి కచ్చకాయ ల్లేవు ॥2॥
ఆటవిడుపు కోస మందరొక్కట గూడి
ఆడపిల్ల లాడె  అష్ట చెమ్మల్లేవు   ॥బడిలో॥


చెడుగు డాటల్లేవు చెమ్మాచెక్క ల్లేవు
కొమ్మలెక్కుతు ఆడే కోతి కొమ్మల్లేవు
గురి చూసి కొట్టేటి గోటీలాటల్లేవు  ॥2॥
ఎండకాలంలోన చింత కింద జేరి
చిమ్ముతూ ఆడేటి చిచ్చు గోనెలు ల్లేవు  ॥బడిలో॥

చెరువు లీతల్లేవు సెలిమ తవ్వుడు లేవు
ఎదురీతలూ లేవూ ఎగవోతలూ లేవు
పారే వాగుల్లల్లో పరుగు వెట్టుడు లేదు ॥2॥
మోట బావులల్లో సూరుగొట్టుకుంటా
మునుగుతు ఆడేటి కోడిపుంజుల్లేవు     ॥బడిలో॥

జాజిరాటలు లేవు కాముడాటలులేవు
రంగులు పూసుకొనే హోళాటలు లేవు
పీరీల గుండంల దూలాటలూ లేవు ॥2॥
మన సంస్కతీ దెలిపి మనసు విరియజేసే
ఆటపాటలు నేడు అస్సలు గానా రావు ॥ బడిలో॥




No comments: