Sunday, December 3, 2017

పండుగచ్చింది

ఎదురుగున్నోళ్లు ఏమనుకుంటరోనని
సిన్నసూపు జూసి సీదరించుకుంటరని
నటించి నమ్మించ నక్కర్లేక
వేష భాషల ఈసడింపులు లేక
నీకు నచ్చినట్టు బతికేరోజు
నిన్ను మెచ్చేటట్టు బతికేరోజు
తెలంగాణకు నేడచ్చింది.
పొద్దు పొడుపు వొడిసి
పొలిమేర తెట్టన తెల్లారి
తెలుగు నేలంత వెలుగునింపినట్టు
తెలంగాణకిప్పుడు పండుగొచ్చింది !

పసితనంల తల్లి పొత్తిళ్లల్ల
ఉగ్గుపాలలో రంగరించిన
పదాలన్ని నేడు పురుడువోసుకొని
ఉప్పొంగి ఉరకలేస్తున్న భావాలతో
వెల్లువయి పారి పరిమళిస్తుంటే
తెలంగాణకిప్పుడు పండుగచ్చింది !

సంకనెత్తుని సందమామను జూపి
గోరుముద్దలతోటి నాడు
అమ్మ నేర్పిన పదాలు
చిన్ననాడు జోలపాడి జోకొట్టిన పదాలు
యెదలోతుల్లో నిలిచిన జానపదాలు
మలినమంత పులిమేసుకొని
తనను తాను  ఆరేసుకున్నట్టు
తెలంగాణకిప్పుడు పండుగచ్చింది !

కాముడు పాటలు బొడ్డెమ్మ పాటలు
సామూహిక సప్పట్ల దరువుల్లోంచి
ఒళ్లంత తడిమి మనసును పెనేసుకున్నట్టు
తనువు మైమరిసి మురిసి పోయేల
తెలంగాణకిప్పుడు పండుగచ్చింది !

భాషకు ఊపిరులూది
భావాలకు రెక్కలచ్చి
ఆత్మగౌరవానికి ఆధారమై నిల్చి
సూర్యచంద్రులొక్కసారి ఉదయించినట్టు
తెలుగు మనసులన్ని
పండువెన్నెల పరుచుకున్నట్టుంది!
తెలుగు నేలంతా
అగరు ధూపమై అలరారినట్టుంది!
మళ్ళా అమ్మదనం చిగురించినట్టుంది
ఆ మాటల కమ్మదనం
అవని మూలలకు పంచేటట్టు
అమ్మభాష జాతరచ్చింది!
తెలుగుభాషకు పండుగచ్చింది!!
తెలుగు నేల నేడు పులకరించింది!!!

No comments: