Saturday, December 30, 2017

ఇనుప తెర

నేస్తమా !
ఇటు చూడు నేస్తమా
నానుంచి  ఎందుకు దూరంగా వెళుతున్నావు
పాలు నీళ్లలా కలిసిన మనల్ని
ఏ రాక్షసహంస వేరుపరిచింది !
మనం తిరిగే భూమి
తాగే నీళ్లు పీల్చే గాలీ
అన్నీ ఒకటే అయినప్పుడు
మనమధ్య ఈ అంతరాలెందుకు?
మనిరువురి నడుమ
ఇనుపతెర నుంచిందే సైంధవుడు నేస్తం !
విషపూరిత తెరలకు విలువివ్వెడ మెందుకు

నీ మనసు పొరల లోతుల్లోని
అనుభవాలను తవ్వి చూడు నేస్తం !
నీకనుల వాకిట కాంతి నింపిన కిరణంనే గానా
నా మనసును వికసింప జేసిన వెన్నెల వెలుగు నీవుగావా

ఒక్కసారి ఆలోచించు నేస్తం
ఆకంచెను తెంచుకొని మనం కలువలేమా?
మనసులకు పట్టిన మలినాలను
అగ్నిపుటం పెట్టి సొక్క పరుచలేమా ?
మానవతా పునాదిపై
మన భవితను నిర్మించలేమా ?
నీవొక్కడుగు నావైపేయి నేస్తం
నేనీ గమ్యం జేర్చి గర్వంగా నిలబెడుతా!

Thursday, December 21, 2017

బాలగేయం

లలలా లలలాలలాల లలలాలలా
బడిలో నా బాల్యమంత గడిచిపోయెరా
పసితనముల     ఆటలన్ని వసివాడెరా "2"


అడుగు నేర్చిన డంటే బడికి పంపు డాయే
ఆటపాటకు నేడు ఆదరణె కరువాయె
పలుకా బలుపమిచ్చి పని జెప్ప వట్టిరి ॥2॥
ఆడుతూ పాడుతూ తిరిగేటి వయసులో
మూట మోసుకుంటు బడికి వోవుడాయే॥బడిలో॥


తొక్కుడు బిల్లల్లేవు దాగుడు మూతల్లేవు
మురుసుకుం టాడేటి ముక్కు గిల్లుడు లేదు
కూసోని ఆడేటి కచ్చకాయ ల్లేవు ॥2॥
ఆటవిడుపు కోస మందరొక్కట గూడి
ఆడపిల్ల లాడె  అష్ట చెమ్మల్లేవు   ॥బడిలో॥


చెడుగు డాటల్లేవు చెమ్మాచెక్క ల్లేవు
కొమ్మలెక్కుతు ఆడే కోతి కొమ్మల్లేవు
గురి చూసి కొట్టేటి గోటీలాటల్లేవు  ॥2॥
ఎండకాలంలోన చింత కింద జేరి
చిమ్ముతూ ఆడేటి చిచ్చు గోనెలు ల్లేవు  ॥బడిలో॥

చెరువు లీతల్లేవు సెలిమ తవ్వుడు లేవు
ఎదురీతలూ లేవూ ఎగవోతలూ లేవు
పారే వాగుల్లల్లో పరుగు వెట్టుడు లేదు ॥2॥
మోట బావులల్లో సూరుగొట్టుకుంటా
మునుగుతు ఆడేటి కోడిపుంజుల్లేవు     ॥బడిలో॥

జాజిరాటలు లేవు కాముడాటలులేవు
రంగులు పూసుకొనే హోళాటలు లేవు
పీరీల గుండంల దూలాటలూ లేవు ॥2॥
మన సంస్కతీ దెలిపి మనసు విరియజేసే
ఆటపాటలు నేడు అస్సలు గానా రావు ॥ బడిలో॥
Monday, December 18, 2017

సిరులు లేని వారి నీసడిం చుజనులు
సిరులు కూడ బెట్టి నీర్ష్య చెందు
ఏమి జేసి నప్రజ లేడ్పుమా నరుగదా
పచ్చిమట్ల మాట పసిడి మూట

Tuesday, December 12, 2017

తెలుగు విభవం 1

1.
తల్లిపాల తోడ తళుకులీనిన తెల్గు
      పసిపాప నవ్వుల పాల నురుగు
విరిసిన జాబిల్లి వెండివెన్నెల తెల్గు
      హేమంతమున రాలు హిమజలమ్ము
అలలతో నలరారి పారేటి నాతెల్గు
      సెలయేటి గలగలా కులుకులొలుకు
చిలుకమ్మ పలుకులో చిగురించు నాతెల్గు
      కోయిల గొంతులో కొలువుదీరె
మంచితేనెకన్న మధురమైనదితెల్గు
       ఇక్షురసముకన్న జిహ్వకింపు
పనస దొనల కన్న పస్సందయినతెల్గు
      తెలుగుభాష కన్న తీపి యెద్ది!

2.తెలుగుభాషకన్న తీయనై నదిలేదు
   తెలుగు పలుకు కన్న తేట లేదు
   సొంత భాష కున్న సొగసై న దేలేదు
  తెలిసి పలుక వలెను తెలుగు జనులు

3.అమ్మ పాలతోడ ఆలకించిన భాష
   వలస భాష చేత వన్నె దగ్గె
 అమృత మోలె నున్న అమ్మ భాష నొదిలి
  పరుల పంచ జేరె పతిత జనులు

4.ఎల్లలో కమునకు తెల్గుఘ నతదెల్ప
           కొలువుదీ రెనుగదా తెలుగు సభలు
    మరచి మరుగువడ్డ ఆచార సంస్కృతుల్
          కాంతులీ నెడుదివ్య కాల మొచ్చె
  ఈసడిం చినమన భాషయా సలునేడు
         దీప్తినొం దిమిగుల తేజరిల్లె
  బీడుబా రిననేల చిగురించి  నట్లుగా
         తనువుపు లకరించి   తాండ వించ
       విశ్వ జనుల కంత విధితమ య్యే లాగ
       భాష సభలు జరిపె భాగ్య నగరి
       విమల రూపు వాణి వినువీధి విహరింప
       తెలుగు జనులు కదిలె తేజ మలర

5.ఆరామ త్రయముతో అలరారె నీనేల
         మూడులిం గములతో మురియి నేల
  కాకతీయులునాడు కారుణ్య బావాల
         పెరిమతో నేలిన గరిమ నేల
  వీరప్ర తపరుద్ర ధీరత్వమునుజూచి
         పులకించినట్టిదీ పుణ్య భూమి
  రాణిరుద్రమదేవి రణభూమిలొ   మెరసి
        కత్తిది ప్పినదినా కదన భూమి

 కవుల పోషణమున ఘనకీర్తు లం దిన
 ఓరుగల్లు లోని తోరణాలు
 నాటివై భవమిల నేటికి నిలిచేల
 చిర యశమ్ము నొసగె శిల్పకళలు

6.చల్ల గాలి లోన పిల్ల తెమ్మెర లోన
 జోల పాట లోన ఈల లోన
వాగు పరుగు లోన వాహినీ పరవళ్ల
మధుర మైన భాష మన తెలుగు 

7.గుండ్ర నక్షరాలు గుర్తుల గాబేర్చి
యాభ యారు పూల హార మల్లి
తెలుగు తల్లి మెడల జిలుగుల నొలికించు
అంద మైన భాష అవని గలదె

8.అలతి పదము తోడ అందమౌ భావాన్ని
  పొంది కగను గూర్చి పొలుపు మీర
  రాగ రంజి తముగ రమ్యాను వర్తియై
 పారు చుండు తెలుగు యేరు వలెను

9. తమ్మి సౌర భమ్ము తుమ్మెద లెరుగును
గాని దాని చెంత కప్ప గాదు
భాష మధురి మలను పండితు డెరుగును
అల్ప జీవు లెరుగ నలవి గాదు

తమ్మి సౌర భమ్ము తుమ్మెద లెరుగును
 చెంత నున్న కప్ప చేత గాదు
భాష మధురి మలను పండితు డెరుగును
అల్ప జీవు లెరుగ నలవి గాదు

10.
సీసం - తెలుగు భాష
ఆదికవి కలమ్ము నవతరిం చిజగాన
ఆదికా వ్యపునాది నాదు తెలుగు
కవిత్రయ ఘనులతో కలిసిన డ్చుటెగాదు
అపరకా వ్యపుసృష్టి నాదు తెలుగు
శతకసా హిత్యాది సత్గ్రంథ ములదీర్చి
అమరమై విరజిల్లు నాదుభాష
వర్ణనా సహితమౌ వరప్రబంధముగూర్చి
అవనిని ల్చివరలు నాదు భాష

వన్నె వాసి చెడక వర్ధిల్లుటే గాదు
అన్ని హంగు లమరి మిన్ను కెగసి
ఆధుని కపువాస
నందిపుచ్చుకొనుచు
అతిపు రాత నమయి అవని వెలిగె

Sunday, December 3, 2017

పండుగచ్చింది

ఎదురుగున్నోళ్లు ఏమనుకుంటరోనని
సిన్నసూపు జూసి సీదరించుకుంటరని
నటించి నమ్మించ నక్కర్లేక
వేష భాషల ఈసడింపులు లేక
నీకు నచ్చినట్టు బతికేరోజు
నిన్ను మెచ్చేటట్టు బతికేరోజు
తెలంగాణకు నేడచ్చింది.
పొద్దు పొడుపు వొడిసి
పొలిమేర తెట్టన తెల్లారి
తెలుగు నేలంత వెలుగునింపినట్టు
తెలంగాణకిప్పుడు పండుగొచ్చింది !

పసితనంల తల్లి పొత్తిళ్లల్ల
ఉగ్గుపాలలో రంగరించిన
పదాలన్ని నేడు పురుడువోసుకొని
ఉప్పొంగి ఉరకలేస్తున్న భావాలతో
వెల్లువయి పారి పరిమళిస్తుంటే
తెలంగాణకిప్పుడు పండుగచ్చింది !

సంకనెత్తుని సందమామను జూపి
గోరుముద్దలతోటి నాడు
అమ్మ నేర్పిన పదాలు
చిన్ననాడు జోలపాడి జోకొట్టిన పదాలు
యెదలోతుల్లో నిలిచిన జానపదాలు
మలినమంత పులిమేసుకొని
తనను తాను  ఆరేసుకున్నట్టు
తెలంగాణకిప్పుడు పండుగచ్చింది !

కాముడు పాటలు బొడ్డెమ్మ పాటలు
సామూహిక సప్పట్ల దరువుల్లోంచి
ఒళ్లంత తడిమి మనసును పెనేసుకున్నట్టు
తనువు మైమరిసి మురిసి పోయేల
తెలంగాణకిప్పుడు పండుగచ్చింది !

భాషకు ఊపిరులూది
భావాలకు రెక్కలచ్చి
ఆత్మగౌరవానికి ఆధారమై నిల్చి
సూర్యచంద్రులొక్కసారి ఉదయించినట్టు
తెలుగు మనసులన్ని
పండువెన్నెల పరుచుకున్నట్టుంది!
తెలుగు నేలంతా
అగరు ధూపమై అలరారినట్టుంది!
మళ్ళా అమ్మదనం చిగురించినట్టుంది
ఆ మాటల కమ్మదనం
అవని మూలలకు పంచేటట్టు
అమ్మభాష జాతరచ్చింది!
తెలుగుభాషకు పండుగచ్చింది!!
తెలుగు నేల నేడు పులకరించింది!!!

తెలుగు విభవం


సీ. ఆదిక వికలమ్ము నంకురిం చినతెల్గు
             ఆదికా వ్యమునకా ధారమయ్యె
    తిక్కన్న ధీయుక్తి తెలియజె ప్పేటట్లు
             పదునైదు పర్వముల్ పరిఢవిల్లె
    ఎర్రన్న వర్ణనై  చిగురించి నతెలుగు
             అష్టదిగ్గజముల కడుగు నేర్పె
    పోతన్న ఘంటాన పొంగిపొ ర్లినతెల్గు
            మకరంద దారల మరులు గొల్పె

ఆ.వె. పూర్వక వులతోడ పొందికై నతెలుగు
             కావ్యర చనలోన కాంతులీనె
        మేరున గముతీరు సౌరులొ ల్కెడుతెల్గు
             అంతరిం చుననెడు చింత వలదు