Friday, November 24, 2017

తాటిచెట్టు

ఇనుప స్తంభపు కొన చిగురించి నట్టు
రాతి శిల శిరమున పచ్చనాకులు మొలిసినట్టు
మొగులంట బెరిగిన గర్వపడక
తనువణువణువు కరుణ నిండిన 
కరుణామయి తాటిచెట్టు !

పోతులూరి కాలజ్ఞానమునకు కాగితమ్మందించి
తాళ్లపాక కృతులకు తాటాకు ప్రతులొసగి
సకల శాస్త్రములకు సాకారమై నిలిచి
తరతరాల చరితకు తాళపత్రములందించిన
ధన్యజీవి తాటిచెట్టు !

సాటి మనిషి పడే గోస జూడలేక
ఎనగర్రగా  ఇల్లు కెన్నుపూసయితది
ఆసమై గూటికి ఆసరా గుండి
నిట్టాడుగా తాడు గుడిసె నిలబెడుతది
ఉర్వకుండా కప్పు కమ్మలనందించి
నిలువెల్ల నర్పించి నిలువ నీడనిచ్చు
నిస్వార్థ జీవి తాటిచెట్టు !

వాగుదాటుటకు వంతెన నయినది
చెరువులల్ల పడవలయి నది
ఊటబావులకు దోనెనందించింది
మానవ మనుగడను మనసార కాంక్షించె
పనిముట్ల నందించిన    పరోపకారి తాటిచెట్టు !

విలువనన పాత్రల చెలువ జూడకుండ
మట్టి పాత్రల నెత్తి చుట్టు గట్టుకోని
సుధామయమైనట్టి సురపాన మందించి
ఆబాల గోపాలము నాదమరిచి ఓలలాడించు
మోహినీమూర్తి తాటిచెట్టు !

పొరక పొదిగి జనులు తడక గట్టుకుంటే
మట్ట జీరి తాటి నార పొట్టెనంస్తది
చేదబావికి చెరోదిక్కు నిలిచి
గిరక దూలమయి నీళ్లు సేదిస్తది
పిడుగువడి తాటి మొగి రాలిపోయినా
పొట్టనత పిట్టగూళ్ల కర్పించే
త్యాగశీలి తాటిచెట్టు !

మట్టలు గొరికి ఉడుతలు గూడు వెట్టినా
వడ్ల పిట్ట మొద్దుకు తూట్లు వొడిసినా
కలత పడి కసురు కోక
తాటికమ్మ దొండ పండ్లు గాసినట్టు
రామచిలుకల గూడి రాగమాలపించు
ఆత్మీయాదరువు తాటిచెట్టు !

తనకు తాను మొలచి తరతరాలు నిలిచి
కులవృక్షమై పేరు గుర్తింపు నొందినా
అన్ని వృత్తులకు ఆసరయి ఉంటది
అన్ని చెట్లను జంపి తానొక్కటే పెరిగే
మర్రి చెట్టు ఒడిల పురుడు వోసుకొని
అంచలం చలుగ  ఆకసమున కెగిసే
ఆశాజీవి తాటిచెట్టు !

కులమతాల కుళ్ళు దరిజేరనీకుండ
కనుమూసి నోళ్లపయి కరుణ గురిపించి
పచ్చి కమ్మలు నిచ్చి పరుపు తానవుతది
రక్త సంబంధీకులు బంధు జనుల తోడ
పాడెతో పాటు కాటి వరకచ్చే
 ఆత్మబంధువు తాటిచెట్టు !

No comments: