Tuesday, November 14, 2017

కళదప్పిన ఇల్లు


పచ్చని తాటాకులతో
కంకబొంగులు పంజరపొరుకలతో
అల్లుకున్న పిట్ట గూడోలె
అదంగున్న మా యిల్లు !

పచ్చని ప్రకతిని తలకెత్తుకుని
రుతువు కనుకూలంగ రూపుమార్చి
మండుటెండల్లో మంచును
నిండు చల్లోన కరి వెచ్చదనాన్ని
పంచేటి మట్టిగోడలు
అరుగు యిల్లు సాయవానులను
అంతఃపురమున దాచిన
గిజిగాని గూడు మా యిల్లు !

ఇంటినిండ పిల్లలు
అల్లరి అరుపులతో చిలిపి చేష్టలతో
ఊరవిస్కలు కోడిపిల్లలతో
నిత్య సందడిగుండే నా యిల్లు !

చుట్టాలు బందువులు 
సుట్టు సోపతిగాండ్లు
సబ్బండ వర్ణాల సాదరాభిమానాలు
బుద్ది సెప్పే వాళ్లు భుజంతట్టే వాళ్లు
ఆప్యాయతానురాగాల అపూర్వ లోగిలి మా యిల్లు !

మూడునాల్గు తరాలు
శాఖోపశాఖలై విలసిల్లిన మొదల్లు
ముదిమి ముసిరి
పండుటాకులై వంగి
చిరుదరహాసపు చిగురుటాకులతో
అల్లుకున్న అనుబంధాల  సాలెగూడు మా యిల్లు!


ఇప్పుడు పండుగ పబ్బాలకు
వచ్చి పోయే పిల్లపాపలతో
ఉద్యోగాలకై వలసవోయిన కొడుకులతో
ఏడాదికోసారి తీరప్రాంతానికి
తరలివచ్చే పక్షులోలె
అడపదడప ఇంటికొచ్చే
అరుదైన అనుబంధాలకై
ఎదిరిచూసి ఎదురు చూసి
కళ్లు కాంతివిహీనమై మెరుస్తున్నయి
యిల్లు కళ దప్పి కనవడుతుంది !

No comments: