Friday, September 29, 2017

కవిఘనత

అలతియలతి తెలుగు పలుకులన్నిటినేరి
కవితలల్లినట్టి కవులు ఘనులు
వారి వలనె తెలుగు వర్ధిల్లు చున్నది
పచ్చిమట్ల మాట పసిడిమూట

Thursday, September 28, 2017

బోయీల బతుకు చిత్రం

అలల ఊయలపై
అలుపెరుగని పయనం
నిలకడ లేని జీవితంలో
నిరంతరం చేపల వేటతో
అనునిత్యం అపనమ్మకంతో
ప్రకృతి నెదురించి సాగె
బతుకు పోరాటం
గోదావరి ఒడిలో
అలలపల్లకి నధిరోహించి
తెప్పె పడవకు తెడ్డేస్తూ
పొద్దుతో పోటీపడే
సుందర సుమధుర జీవితచిత్రం
 బోయీల బతుకు చిత్రం !

ఆలుబిడ్డల ఆకలి తీర్చ
పొద్దుపొడుపుతో నిద్రలేచి
నాటుపడవల నమ్ముకొని
లోతట్టుప్రాంతాలకు
పయనమవుతరు
చేపలు వేటాడుటకు !

చేపలు దొరికినవేళ
తెప్పనిండ విరిసిన జలపుష్పాలతో
మదినిండ విజయోత్సాహం !
నుదుటన గర్వరేఖతో
ఇల్లుచేరెడు బోయీలు !

వేట నిష్పలమైన వేళ
నిరాశ నిస్పృహలతో
మెయినిండ చెమటలతో
విషన్న వదనంతో
తిరుగు పయనంలో బోయీలు!

అలలపై తేలాడే తెప్పలపై
నిరాధారపు పయనం
భరోసా లేని జీవితం !
బోయీల బతుకు చిత్రం !!
Sunday, September 17, 2017

కృషీవలుడు "నాన్న"

నాన్నంటే!
జీవనగతిని మార్చు నావికుడు
నాన్నంటే
మనల నడిపించు నాయకుడు
నాన్నంటే
నడయాడు టంకశాల కాదు
నాన్నంటే
అవసరాలు దీర్చే యంత్రం గాదు
మనకోసం జీవితాన్ని అర్పిస్తూ
తన రక్తాన్ని స్వేదంగా మలచి
శ్రమించే నిరంతర శ్రామికుడు
మనందరి కానందంపంచుతూ
మనలో తనానందాన్ని చూసుకునే
నిస్వార్థపరుడు నాన్న !
అమ్మ లా కన్నులు చెమ్మగిల్లనీకుండా
కష్టాన్ని కన్నీళ్లను చూసి
కుటుంబం కుంగిపోతుందని యెంచి
దుఃఖాన్ని దిగమింగి
దైర్యంగా నిలబడు సాహసికుడు నాన్న !
అహర్నిషలు అంతరం లేక
చీడ పీడలు దరిచేరకుండ
అనునిత్యం పరితపించు కృషీవలుడు నాన్న !
నాన్నంటే బాధ్యత
నాన్నంటే క్రమశిక్షణ
నాన్నంటే పరువు ప్రతిష్ట

అనుచరగణం కోసం అనునిత్యం శ్రమించు
నాన్నను ప్రేమించు !
             నాన్నను గౌరవించు !!
                          నాన్నను అనుసరించు !!!


అమ్మతనం


అమ్మంటే అనుబంధాలు అల్లుకున్న పొదరిల్లు
              అప్యాయతానురాగాల మేళవింపు                        మమతానురాగాల మారురూపు
అమ్మంటే ఎడతెగని ప్రేమ పాశం
అమ్మంటే అవిరల త్యాగం
అమ్మంటే అడిగిన విచ్చే దేవునిరూపం
అమ్మంటే రామరక్షణం
అమ్మకు సాటి లేదు భూతలం
అమ్మంటే అపూర్వం !
అమ్మతనం అపురూపం ! !


విరివింటి దొర

నా కనుల కాన్వాసు పై
నీరూపు బొమ్మను గీసి
కునుకు రాకుండ చేసావు !
నా హృదయకడలిలో
 నీ తలపుల  అలజడి రేపి
నా మదికలువను మదనపరిచావు !
విలువింటిదొర చెలికాడవై
విరి బాణాల పరంపరతో
మధుర బాధ కలిగించావు !
దూరంగా వుండి దోబూచులాడక
దరి చేరు దారులు వెతికి
 వయసు వారువాన్నధిరోహించి
అలల పరువానికి అడ్డుకట్టలేసేయ్Saturday, September 16, 2017

ముకుళ కమలం

చందమామకు చలేసిందేమో
చుక్కల దుప్పటి గప్పుకొని
ఆకాశం కౌగిట్లో ఒదిగి పోయింది
కలువలు కలవరపడి
చెరువు యెద లోతుల్లో
చెమ్మగిల్లి చింతిస్తున్నాయి
లోకమంత
చిమ్మ చీకటి కమ్ముకుపోయింది
సూర్యోదయపు సుందర దృశ్యం
అగుపించేదెపుడో?
కారుచీకటిని పారదోలు
కాంతిపుంజం కనిపించేదెపుడో ?
నా హృదయ కమలం
వికసించి విరబూసేదెపుడో ?

Friday, September 15, 2017

సిగ్గరి మబ్బు

రైతుల అర్థనగ్నపు
సాగువాటు సాటుగ జూసి
నీలినింగి సిగ్గుపడి
మబ్బు దుప్పటి గప్పుకుంది !

ఆకాశపుటంచున వేలాడుతున్న
నల్లని కొండల జూసి
ఉల్లమున సంతసము
వేళ్లూనుతుండ

అపురూప వొస్తులు
పాత సందుగల దాసినట్టు
తీరైన ఇత్తుల దెచ్చి
మట్టి పొరల మరుగున దాసిరి !

సిగ్గువీడి సిరుజల్లు
కురిపించి కరుణించేదెపుడో ?
పుడమి పులకరించి
పరవశంతో పరితపించే దెపుడో ?
అన్నదాతల ఆశలు
అంకురించి మురిపించేదెపుడో ?

Thursday, September 14, 2017

కవి శేఖరుడు సినారె

సమాజ స్థితిగతులకు
సజీవ సాక్షిగ నిలిచి
భావకవుల వారసుడై
భావికవుల మార్గదర్శకుడై
కొత్తపాతల కలయికతొ కవనమల్లిన
అభినవ కవితాఝరి
అభ్యుదయ కవితా దార సినారె

కవన లోకపు యవనికపై
వెలుగులీనిన వెన్నెల తార
తెలుగు సాహితీ సౌరభాలను
దిగంతాల గొనిపోయిన మలయమారుత వీచిక

సరస సాహితీప్రియులను
శబ్ధమాధుర్య భావ గాంభీర్య
గీతాలహరిలో ఓలలాడించి
మురిపించి మైమరిపించే సమ్మోహన గీతిక


జనన సామాన్యుడైన జడువక
సాహిత్యపు లోతుల సారమెరిగి
చిరు ప్రాయాది ముదిమి వరకు
నిరంతర కవన మొనర్చి
విశ్వంభరుడవై నిలిచి జ్ఞానపీఠమెక్కినావు
విశ్వ సాహిత్యాంబరంపై
విజ్ఞాన దీపికవై ప్రజ్వరిల్లినావు

మట్టి మనషి ఆకాశపు తత్వమున తెలియజెప్పి
మంటలు మానవుడులోని మర్మమును తెలిపి
జగద్విఖ్యాత సాహితీమూర్తివై
విశ్వగీతి మోగించి విశ్వమంత ఎదిగావు

వినీల విశాల సాహితీపథాన సాగిన
అలుపెరుగని బాటసారి
నిరంతర కవనఝరి
నిత్య చైతన్యశీలిసింగిరెడ్డి

సాహితీ మేరునగపు శిఖరాగ్రాన
తెలుగు పూలు తురిమిన కవిశేఖరం
నడయాడు స్నిగ్ధగాంభీర్య
మనోహర రూపం సి నా రె


Tuesday, September 12, 2017

కలం యోధుడు ( కాళోజీ )

అమాయకత్వం ఆసాంతం నిండిన తెలంగాణలో
చైతన్య దీపికను ప్రసరించి
అణగారిన వర్గాలకు అక్షరజ్ఞానం
అందని ద్రాక్షే ఐన రోజుల్లో
పాలక భాషా పఠనం గావించి
ఉర్దూతో ఔన్నత్యం సాధించి
తెలుగు నుడికారము నొంట బట్టించుకొని
కన్నడ మరాఠాది భాషలపై పట్టు సాధించినా
మాతృభాషా మమకారం వీడలేక
వచన కవితలో వాడుక భాషను జొప్పించి
ప్రజల భాషకు పట్టం గట్టిన ప్రజాకవి కాళోజీ !

రజాకార్ల రాక్షసత్వంలో
నలుగుతున్న తెలగాణను
కవితలతో కనువిప్పు గలిగించి
బానిసత్వపు బాధలు బాపుటకు
ఉద్యమమే ఊపిరిగ బతికిన
                       సంఘ సంస్కర్త కాళోజీ  !!

అరచాకాలకు అడ్డలుగ నిలిచిన
దొరల గడీలను గూల్చి
వెట్టిచాకిరికి నెలవైన దొరతనం
దొరల అడుగులకు మడుగులొత్తె
భూస్వామ్య వ్యవస్థల భూస్థాపితంజేయ
కలమే కరవాలంగ యుధ్ధం జేసిన
                      కలం యోధుడు కాళోజీ !!!

రజాకార్ల రాక్షసకాంండను
నిజాం వ్యతిరేక స్వరంలో
పాలకుల ప్రవృత్తిని
తూర్పార బట్టిన సాహసికుడు
సమసమాజ స్వాప్నికుడు
రాజకీయ సాంఘిక చైతన్య సారథి
విగ్రహారాదన ను నిరసించిన అభ్యుదయ వాది
కవితా పరవళ్లతొ కలకలం రేపిన కలం యోధుడు
బానిససంకెళ్ల విముక్తికై విజృంభించిన విప్లవకారుడు
సామాన్యుడి హక్కులడిన ప్రజలమనిషి
తెలంగాణ దశను దిశనూ మార్చిన మార్గదర్శి

అక్షరావేశపు మేళవింపు తో
జాతిని జాగృత పరచిన నిత్య చైతన్యశీలి !
ప్రజల గొడవను తన గొడవగా యెంచి
పలుకుబడులకై పరితపించి
నీ భాష యాసలల్లనే బతుకున్నదని
  చాటిన కాళోజి
     చిరస్మరణీయుడు !
        సదా వందనీయుడు !!Thursday, September 7, 2017

నిస్వార్థ శిల్పి

అమ్మ ఒడి వీడినంతనే
అక్కున జేర్చుకొని
ఆప్యాయతానురాగపు
ఆటపాటలతో  ఆదరించి
ఓరిమితో ఓనమాలు దిద్దించి
అలతియలతి మాటలతో
విలువలెన్నొ నేర్పించి
పసిప్రాయపు మది మురిసే
కథలతో గేయాలతో
మానవతను నేర్పించి
మనలను మనిషిని జేసి
కాఠిన్యముతో క్రమశిక్షణ నేర్పి
క్రమముగా లాలించి కరుణ జూపి
చదువుల సారాన్ని చక్కగనందించి
విలువలు నేర్పి వినయశీలిగమార్చి
శిష్యోన్నతిని జూసి గర్వపడతూ
మురిసి మైమరచి పోయె
నిరాడంబర శీలి 
నిస్వార్థ శిల్పి గురువు

Tuesday, September 5, 2017

గురువులు

1.
అవనిగ్ర మ్మెడునట్టి అంధకారము బాప
         అవతరిం చెగురువు లవని యందు
శుద్ధ ఫలకముతో శోభిల్లు శిశువుల
         కోనమాలను నేర్పు నోర్మితోడ
సద్భాష్య ములతోడ సందేహముల్ మాన్పి
         జ్ఞానసుధలొసంగు ఘనులు గురులు
విద్యతోడను మంచి విలువల నందించి
        వినయశీలిగ మార్చు విజ్ఞ విభులు

  తాను విత్తు తరులు తన్ను మించి బెరిగి
   పక్వ ఫలములీయ పరవశించు
మంచి మనసు మిగుల మహిమాన్వితగురువు
   లందరి కొనరింతు  వందనములు

2.
పాంచభౌ తికమయ్యి పరిణమిం చెడుతన్వు
       పరిమళ మ్ములబుల్ము బ్రహ్మ గురువు
కోపమిం చుకలేక కూనలం దరకును
       ఓనమా లనునేర్పు ఓర్మి గురువు
దిక్కుతో చనియట్టి ధీనయా నములోన
       దారిజూ పెడుమార్గ దర్శి గురువు
అంతరం గములోని యనుమాన ములదీర్చ
       జ్ఞానసు ధలొసంగు ఘనుడు గురువు

అవని బులిమి (నంటి)యున్న అంధకా రముబాప
భాస్క రసము డయ్యి భాస మొసగి
అహమె రుగక భువిని అలరారు గురువర్యు
లందరకును జేతు వందనములు

3.
మట్టి బొమ్మ వంటి మనిషి మస్తిస్కాన
అక్షరాల నాటు హాలి కుండు
అవని జనుల నిండు అంధకారముదీర్చ(అజ్ఞాన మునుబాప)
దివ్వెల వెలిగించు దివిటి గురువు

4.
తనపర మ్మెంచక తనలోని సత్వమ్ము
 ఛాత్రకో టికిబంచు చాగ జీవి
తారత మ్యములేక తనదైన విద్యను
  దాచుకొ నకనిచ్చు ధన్యజీవి
సాహిత్యాం బుధిలోన సాంతమ్ము తామున్గి
  మంచిము త్యములను బంచి యొసగు
లోకపో కడలోని లోగుట్టు తానెర్గి
  మసలురీ తిమనల కొసగు తాను

తల్లి దండ్రు లొసగు తనువున ణువణువు
విద్య గంధ మద్ది విమల పరిచి
మంచి విలువ లొసగి మనిషిగా మలచేటి
గురువు మించి నట్టి సురలు గలరె?

5.
తల్లిక న్నమిగుల తపనజెం దుతుతాను
మనలమ నుషులుగ మలుచు కొరకు
తండ్రక న్నమిగుల తహతహ బడుగాక
బాధ్యత నుతెలిప పాటు పడును
బందుజ నముకన్న పరితపిం చుమిగుల
అభ్యుయ మ్ముకొరకు ఆర్తి జెందు
దేవుళ్ల మించిన దైవమే తానయ్యి
అతిశయ మ్మొసగేటి వరములొసగు

సకల మొసగు మనకు స్వార్థమిం చుకలేక
తనదు సర్వ విద్య దార వోయు
అపర భాగ్య మిచ్చు దాతమా త్రమెగాదు
బ్రతుకు దీర్చి నట్టి బ్రహ్మ తాను

6.
మట్టి బొమ్మ వంటి మనిషి మస్తిస్కాన
అక్షరాల నాటు హాలి కుండు
అవని జనుల నిండు అంధకారముదీర్చ
దివ్వెల వెలిగించు దివిటి గురువు

Monday, September 4, 2017

గురువు(పద్యం)

మట్టి బొమ్మ వంటి మనిషి మస్తిస్కాన
అక్షరాల నాటు హాలి కుండు
అవని జనుల నిండు అంధకారముదీర్చ
దివ్వెల వెలిగించు దివిటి గురువు